కలం, నిర్మల్: బైంసా పట్టణ మాస్టర్ ప్లాన్ వ్యవహారం (Bhainsa Master Plan Row) ఇప్పుడు రాజకీయ వివాదాన్ని దాటి ఉద్యోగ వర్గాల్లో ఆగ్రహానికి దారితీసింది. పట్టణ అభివృద్ధి కోసం నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) పై ఎంఐఎం నేత చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఐఏఎస్ అధికారిపై బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టర్‌కు సంఘీభావం ప్రకటించాయి.
ఈనెల 28న బైంసా మున్సిపల్ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ దత్తాద్రి, వైస్ చైర్పర్సన్ కుతీజా సిద్ధిఖీ, కౌన్సిలర్ల సమక్షంలో పట్టణ భవిష్యత్తు అవసరాలు, 2040 నాటి అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని చర్చించారు. అయితే మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఎంఐఎం కౌన్సిలర్లు సమావేశంలో నిరసన తెలిపారు.
అనంతరం కౌన్సిలర్ జాబీర్ అహ్మద్ కలెక్టర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు, ఒక వర్గానికి ప్రయోజనం చేకూర్చేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదం, నినాదాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ పరిణామంపై స్పందించిన బైంసా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్పర్సన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కౌన్సిల్ తరఫున కలెక్టర్‌కు క్షమాపణలు తెలిపారు. అయినప్పటికీ, ఒక ఐఏఎస్ అధికారిపై బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జిల్లా ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.
నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన..
కలెక్టర్‌కు సంఘీభావంగా శనివారం టీజీఈజేఈసీ, పెన్షనర్ల సంఘం నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో భవేష్ మిశ్రాను కలిసి తమ మద్దతు ప్రకటించారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తూ జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న అధికారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
భైంసా పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న కలెక్టర్‌కు ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు అండగా ఉంటాయని స్పష్టం చేశారు. కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా భవిష్యత్తులో ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలు, రాజకీయ నిరసనలతో మొదలైన వివాదం ఇప్పుడు జిల్లా ఉద్యోగుల సంఘీభావ ఉద్యమానికి దారితీయడం చర్చనీయాంశంగా మారింది.

