డాకర్ యూత్ ఒలింపిక్స్ షురూ.. బరిలో 17 మంది భారత అథ్లెట్లు

కలం, స్పోర్ట్స్ : ఆఫ్రికా గడ్డపై ఒలింపిక్ సందడి మొదలైంది. సెనెగల్ రాజధాని డాకర్ వేదికగా 2026 యూత్ ఒలింపిక్స్ (Dakar Youth Olympics ) శనివారం ప్రారంభమవుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో తొలిసారిగా ఒలింపిక్ క్రీడల నిర్వహణ జరుగుతోంది. నవంబర్ 13 వరకు జరిగే ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,700 మంది యువ అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈసారి భారత్ నుంచి 17 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వీరిలో 11 మంది అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. మొత్తం 11 క్రీడల్లో భారత క్రీడాకారులు పోటీపడనున్నారు.

ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, జూడో, సెయిలింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, బీచ్ రెజ్లింగ్, వుషు క్రీడల్లో భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత బృందంలో పలువురు యువ క్రీడాకారులపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న స్విమ్మర్ ధినిధి దేశింగు ఈసారి మూడు విభాగాల్లో పోటీపడనుంది. మహిళల 100 మీటర్లు, 200 మీటర్ల ఫ్రీస్టైల్‌తో పాటు 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో బరిలోకి దిగనుంది. ఆసియా అండర్-17 బ్యాడ్మింటన్ ఛాంపియన్ తన్వి పత్రి మహిళల సింగిల్స్‌లో పోటీపడనుంది.

టేబుల్ టెన్నిస్‌లో సిండ్రెలా దాస్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇక 14 ఏళ్ల విండ్‌సర్ఫర్ ప్రియాంశి పాటిల్ భారత బృందంలో అత్యంత చిన్న వయస్కురాలు. నవంబర్ 8 నుంచి ఆమె పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 25 క్రీడలు, 153 పతక విభాగాలు ఉన్నాయి. డాకర్‌తో పాటు డయమ్నియాడియో, సాలీ నగరాల్లో పోటీలు నిర్వహించనున్నారు. శనివారం డయమ్నియాడియోలోని అబ్దులాయే వాడే స్టేడియంలో ప్రారంభోత్సవం జరగనుంది. యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు గతంలో మంచి రికార్డు ఉంది.

ఇప్పటివరకు జరిగిన మూడు ఎడిషన్లలో 23 పతకాలు సాధించింది. ఇందులో మూడు స్వర్ణాలు, 16 రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. 2018లో బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన పోటీల్లో అత్యధికంగా 13 పతకాలు గెలుచుకుంది. ఈసారి కూడా యువ అథ్లెట్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. భారత్‌లో ప్రత్యక్ష టీవీ ప్రసారంపై స్పష్టత లేదు. అధికారిక ఒలింపిక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో లైవ్ అప్‌డేట్స్, ప్రసార వివరాలు అందుబాటులో ఉంటాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>