కలం, వెబ్ డెస్క్: నెల్లూరు (Nellore) జిల్లాలోని రాపూరు ఘాట్ రోడ్డు (Rapur Ghat Road) లో చిరుతపులుల సంచారం మరోసారి తీవ్ర కలకలం రేపుతోంది. రాపూరు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న రాజంపేట బస్సులోని ప్రయాణికుల కంట ఈ రెండు చిరుత పిల్లలు పడ్డాయి. అవి రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడపై ప్రశాంతంగా కూర్చుని ఉండటాన్ని చూసి ప్రయాణికులు షాక్ కు గురయ్యారు.
ఈ మధ్యకాలంలో ఈ ఘాట్ రోడ్డు పరిసరాల్లో, ప్రధాన రహదారిపై, పిట్టగోడలపై చిరుతలు తరచూ దర్శనమిస్తున్నాయి. చీకటి పడిన తర్వాత ఈ ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటేనే ప్రజలు, వాహనదారులు హడలిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వన్యప్రాణులు దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఒంటరి ప్రయాణాలు చేయకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

