కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం(Bhadrachalam) వద్ద గోదావరి నదిపై కొత్తగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జిపై (New Godavari Bridge) వాహనదారులకు పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. వంతెన పటిష్టతను పరిశీలించేందుకు అధికారులు అక్టోబర్ 31 నుంచి లోడ్ టెస్టింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 7వ తేదీ వరకు వారం రోజుల పాటు నూతన బ్రిడ్జిపై రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ వంతెనపై లోడ్ పరీక్షలు జరిగే సమయంలో వాహనాల రాకపోకలను సమీపంలోని పాత గోదావరి బ్రిడ్జి మీదుగా మళ్లించనున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని గమనించి వాహనదారులు, ప్రయాణికులు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

