కలం, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో(Musi rejuvenation Project) కీలక ముందడుగు పడింది. గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్-2, ఫేజ్-3 ప్రణాళికలో భాగంగా నగరంలోని జంట జలాశయాలకు నీటిని తరలించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణంపై పురపాలక శాఖ స్పష్టమైన ప్రణాళిక రూపొందించింది. ఏ ప్రాంతం నుంచి ఎక్కడి వరకు పైప్లైన్లు నిర్మించాలి? వాటికి అనుబంధంగా ఎలాంటి పనులు చేపట్టాలనే అంశాలను ఖరారు చేసింది.
ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పద్ధతిలో చేపట్టనున్నారు. ఇందులో ప్రభుత్వం 40 శాతం, టెండర్లు దక్కించుకున్న ప్రైవేట్ నిర్మాణ సంస్థలు 60 శాతం నిధులు సమకూర్చనున్నాయి. మొత్తం రూ.7,360 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనులకు సంబంధించిన నిధులను ఉమ్మడి ‘ఎస్ క్రో’ ఖాతాలో జమ చేయనున్నారు. జలమండలి రూపొందించిన ప్రణాళికకు ప్రభుత్వం ఇప్పటికే పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. గోదావరి జలాలను జంట జలాశయాలకు తరలించే విధానాన్ని కూడా ప్రణాళికలో వివరించింది. ఈ ఏడాది జూన్ 24వ తేదీని అవార్డు డేట్ (అపాయింట్మెంట్ డేట్)గా నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని ప్రకారం పనులు చేపట్టే నిర్మాణ సంస్థలకు పదేళ్ల పాటు ఆపరేషన్, మెయింటెనెన్స్ బాధ్యతలు అప్పగించనున్నారు.
ఇవీ చేపట్టనున్న ప్రధాన పనులు..
- ఘన్పూర్ నుంచి ఉస్మాన్‌సాగర్ వరకు 2,200 మిల్లీమీటర్ల వ్యాసంతో పైప్‌లైన్ నిర్మాణం.
- ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు 2,400 మిల్లీమీటర్ల వ్యాసంతో పైప్‌లైన్ ఏర్పాటు.
- కోకాపేట్ నుంచి ఉస్మాన్‌సాగర్ వరకు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెంబడి 3,000 మిల్లీమీటర్ల వ్యాసంతో పైప్‌లైన్ నిర్మాణం.
- ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లను అనుసంధానిస్తూ 2,200 మిల్లీమీటర్ల వ్యాసంతో పైప్‌లైన్ ఏర్పాటు.
- ఘన్పూర్ వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి మిషన్ భగీరథ రిజర్వాయర్ వరకు 3,000 మిల్లీమీటర్ల వ్యాసంతో పైప్‌లైన్ నిర్మాణం.
- ఘన్పూర్ వద్ద 80 మిలియన్ లీటర్లు, 18 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన (శుద్ధి చేయని నీటి) రిజర్వాయర్లు, పంప్‌హౌస్, ట్రాన్స్ఫార్మర్లు, సబ్‌స్టేషన్ నిర్మాణం.
- ఉస్మాన్‌సాగర్ సమీపంలో 120 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 18 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన (శుద్ధి చేసిన నీటి) రిజర్వాయర్, పంప్‌హౌస్, సబ్‌స్టేషన్ ఏర్పాటు.
- మిషన్ భగీరథ రిజర్వాయర్ నుంచి 22.50 మిలియన్ లీటర్ల నీటిని ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్‌కు తరలించేందుకు 400, 600, 800 మిల్లీమీటర్ల వ్యాసంతో డిస్ట్రిబ్యూషన్ మెయిన్ పైప్లైన్ల ఏర్పాటు.
ఈ మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారా గోదావరి జలాలను జంట జలాశయాలకు తరలించేందుకు అవసరమైన వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ఈ పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

