బియ్యం ధరలకు కళ్లెం.. మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలను (Rice Prices) నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్‌కు తరలించినా, అధిక ధరలకు విక్రయించినా ఉపేక్షించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) హెచ్చరించారు. ప్రజలు ఎక్కువగా వినియోగించే సాధారణ బీపీటీ రకం బియ్యాన్ని కిలో రూ.66కే విక్రయించాలని, అంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

శుక్రవారం హైదరాబాద్ కుందన్‌బాగ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. టోకు, చిల్లర వ్యాపారులు, రైస్ మిల్లర్లతో అధికారులు జరిపిన చర్చల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాల నియంత్రణకు చేపట్టిన చర్యలు, తనిఖీల పురోగతిని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు.

ఆర్ఎన్ఆర్ ధరలపై త్వరలో నిర్ణయం

బీపీటీ బియ్యానికి గరిష్ట ధరను నిర్ణయించిన ప్రభుత్వం.. మార్కెట్లో లభించే ఆర్ఎన్ఆర్ రకం బియ్యం ధరలపైనా దృష్టి సారించింది. ఈ రకం బియ్యం నాణ్యత, ఉత్పత్తి వ్యయం, మిల్లింగ్ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని త్వరలో ధరలను సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ధరలు పెరుగుతాయనే భయంతో అవసరానికి మించి బియ్యం కొనుగోలు చేయవద్దని సూచించారు. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న నాణ్యమైన సన్నబియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఐదు శాఖల దాడులు.. 12 కేసులు

బియ్యం ధరల నియంత్రణలో భాగంగా హైదరాబాద్ పరిసర జిల్లాల్లో పౌరసరఫరాలు, పోలీస్, జీఎస్టీ, లీగల్ మెట్రాలజీతో పాటు సంబంధిత ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ప్రధాన హోల్‌సేల్ వ్యాపార కేంద్రాలైన బేగంబజార్, నాంపల్లి, మహారాజ్‌గంజ్ ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బియ్యాన్ని నిల్వ ఉంచిన, అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మార్కెట్‌లో ధరలు స్థిరపడే వరకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>