కలం, వెబ్‌డెస్క్: ఢిల్లీలో నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ మెగా ర్యాలీని దీపావళి తర్వాతకు వాయిదా వేయాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)కి విజ్ఞప్తి చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రతిపక్ష ఇండియా కూటమి ఈ ర్యాలీని నిర్వహిస్తోంది. అయితే ఇది దీపావళి షాపింగ్‌కు కీలక సమయం కావడంతో తీవ్ర ఆర్థిక నష్టాలను తెచ్చిపెడుతుందని సీటీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, ఓట్ల చోరీని అరికడమే లక్ష్యంగా ఈ ‘చలో ఢిల్లీ రామ్‌లీలా మార్చ్’ను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ చెబుతోంది.
ట్రాఫిక్ సమస్యపై ఆందోళన
కాంగ్రెస్ తలపెట్టిన ఈ భారీ ర్యాలీకి దాదాపు 10 లక్షల మంది ప్రజలు, 15,000 నుండి 20,000 వాహనాలు తరలివచ్చే అవకాశం ఉందని, దీని వల్ల సెంట్రల్ ఢిల్లీలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడి లాక్డౌన్ వంటి వాతావరణం నెలకొంటుందని సీటీఐ పేర్కొంది. నవంబర్ 6న ధనత్రయోదశి, నవంబర్ 8న దీపావళి పండుగలు ఉన్నందున, నవంబర్ 1వ తేదీ వ్యాపారులకు అత్యంత రద్దీతో కూడుకున్న సమయమని తెలిపారు. చాందినీ చౌక్, సదర్ బజార్, కన్నాట్ ప్లేస్, కరీ బావలీ వంటి సుమారు 20 ప్రధాన హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో రోజువారీ రూ. 10,000 నుండి 12,000 కోట్ల వ్యాపారం పూర్తిగా స్తంభించిపోతుందని ట్రేడర్స్ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ వెల్లడించారు.
రామ్‌లీలా మైదాన్ వద్ద అంత భారీ సంఖ్యలో వాహనాలను పార్క్ చేయడానికి తగిన స్థలాలు లేకపోవడం ప్రధాన సమస్యగా సీటీఐ ప్రస్తావించింది. అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద కేవలం 5,000 నుండి 7,000 మందితో జరిగిన నిరసనకే సెంట్రల్ ఢిల్లీ ఎనిమిది గంటల పాటు స్తంభించిపోయిందని, ఇప్పుడు 10 లక్షల మంది వస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. ఈ ర్యాలీని తాము వ్యతిరేకించడం లేదని, కేవలం వ్యాపారుల జీవనోపాధిని, పండుగ సీజన్ వ్యాపారాన్ని కాపాడుకోవడానికే ఈ అభ్యర్థన చేస్తున్నామని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 సాయంత్రం నుంచే సరిహద్దుల వద్ద బారికేడ్లు, ట్రాఫిక్ ఆంక్షలు మొదలయ్యే అవకాశం ఉందని తెలిపారు.
వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీటీఐ రెండు ప్రత్యామ్నాయాలను సూచించింది. ఈ ర్యాలీని దీపావళి తర్వాత నవంబర్ 10న లేదా మరో తేదీకి వాయిదా వేయాలని కోరింది. కుదరని పక్షంలో వేదికను రామ్‌లీలా మైదాన్ నుండి తగినన్ని పార్కింగ్ వసతులున్న బురారీ మైదాన్‌కు మార్చాలని కోరింది. నవంబర్ 1వ తేదీన 56 పారిశ్రామిక ప్రాంతాల నుండి సుమారు 5,000 ట్రక్కులు, టెంపోలు మార్కెట్లకు వస్తువులను చేరవేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకుంటుందని వర్తక సంఘాలు తీవ్రంగా ఎదురుచూస్తున్నాయి.
Also Read : చర్చకు రెడీ.. రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్
Follow Us On: Youtube

