కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, ప్రస్తుతం ఎంపిక చేసిన కరువు మండలాలను క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే ప్రకటించినట్లు ఉందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఆరోపించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెంట్లవెల్లిలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, అయినా ఆ ప్రాంతాన్ని కరువు మండలంగా ఎందుకు ప్రకటించలేదు? రైతులు రోడ్డుపైకి వచ్చి నీళ్లు ఎక్కువయ్యాయని ధర్నాలు చేశారా? అంటూ ప్రశ్నించారు. అలాగే నవాబుపేటలో అన్ని పంటలు ఎండిపోయాయి, అక్కడ కాలువలు ఉన్నాయా? నదులు ఉన్నాయా? ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 15 మండలాలను కరువు మండలాలుగా ఎందుకు ప్రకటించలేదంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
అధికారులు అన్ని ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి కరువు మండలాలను ప్రకటించారా? లేక ఏసీ గదుల్లో కూర్చొని తూతూ మంత్రంగా కరువు మండలాలు ప్రకటించాలంటూ ఎద్దేవా చేశారు. కరువు మండలాలను ప్రకటించకుండా, పంటలు వేయవద్దని ఒక ఒక ప్రకటన జారీ మాత్రమే చేశారని, రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం చూపలేదని దుయ్యపట్టారు.అచ్చంపేటలోని మారుమూల ప్రాంతాలు, పెంటల్లో తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఎల్‌నినో గురించి కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రైతులు పంటలు వేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం, పంటలు వేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పడం మూర్ఖత్వమని ఆయన అన్నారు.
శ్రీశైలం జలాశయంలో 180 టీఎంసీల నీళ్లు ఉండగా, ప్రస్తుతం 55 టీఎంసీలకు చేరాయి. 130 టీఎంసీల నీళ్లు ఎక్కడికి పోయాయి? తెలంగాణ కనీసం 30 టీఎంసీల నీటిని కూడా వినియోగించుకోలేదు. 130 టీఎంసీల నీటిని అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకు పోయారని ఆరోపించారు. కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజర్వాయర్లను నీటితో నింపడం లేదని, కానీ 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు వ్యవసాయ అవసరాల కోసం నీటిని తరలించారని ఆయన తెలిపారు. కేఎల్ఐ పంపులను ఆన్ చేసి నార్లాపూర్, ఏదుల వంటి ప్రాజెక్టులను నీటితో నింపాలని చెప్పినా పట్టించుకోకుండా గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖలో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారి వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు.

