కలం, వరంగల్ బ్యూరో: డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు వరంగల్ పోలీసులు (Warangal Police) ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత ఆధ్వర్యంలో ఆటోనగర్, కరీమాబాద్, కాశీబుగ్గ, శంభునిపేట, శివనగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులు, డ్రగ్స్ కేసులతో సంబంధం ఉన్నవారు, అనుమానితులు కలిపి మొత్తం 107 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 17 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లతో పాటు మూడు ఎలక్ట్రిక్ మోటార్ పంపులను స్వాధీనం చేసుకున్నారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో పిటా చట్టం కింద ఒక కేసు నమోదు చేశారు.
సమాజ భద్రతకు ముప్పు..
ఈ సందర్భంగా సీపీ ఎన్.శ్వేత మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తుతో పాటు సమాజ భద్రతకు ముప్పుగా మారుతోందన్నారు. మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలు, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యసనానికి గురైన వారికి చికిత్స, కౌన్సెలింగ్ అందించి సాధారణ జీవనంలోకి తీసుకువచ్చేందుకు కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను వివరిస్తూ ప్రతి కాలనీలో కమ్యూనిటీ సీసీటీవీ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇకపై కూడా ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సీపీ ఎన్.శ్వేత స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగం, విక్రయాలు లేదా ఇతర నేరాల సమాచారం తెలిస్తే డయల్ 100 లేదా 112కు సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ తనిఖీల్లో ఇన్‌ఛార్జి ఏసీపీ నరసింహారావు, మట్టెవాడ, ఇంతేజార్గంజ్, మిల్స్‌కాలనీ, మడికొండ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

