జ‌ర్న‌లిస్టులు ఉద్యమానికి సిద్ధం కావాలి: మధుగౌడ్

కలం, వనపర్తి: జర్నలిస్టుల దీర్ఘకాలిక ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని టీయూడబ్ల్యూజే, ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధుగౌడ్ (Gundrathi Madhu Goud) పిలుపునిచ్చారు. శుక్రవారం వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు మాధవరావు అధ్యక్షతన నిర్వహించిన యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనకు సంఘటిత పోరాటమే మార్గమని పేర్కొన్నారు.

హామీ మేరకు ఇళ్ల స్థలాలు కల్పించాలి

ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టులకు సొంత ఇళ్ల స్థలాలు లేకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు నవంబర్ 4న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా వనపర్తి జిల్లాలో 409 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందేలా జిల్లా కమిటీ కృషి చేయడాన్ని అభినందించారు. మిగిలిన అర్హులకు అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రేవల్లి సింగిల్ విండో కాంప్లెక్స్‌లోని ఖాళీ షట్టర్‌లో ప్రెస్‌క్లబ్ ఏర్పాటుకు యూనియన్ తరఫున ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టులు పక్షపాతానికి తావులేకుండా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని సూచించారు.

అన్యాయాలపై ప్రశ్నించాలి

ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ప్రశాంత్ మాట్లాడుతూ సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలపై జర్నలిస్టులు ప్రశ్నించినప్పుడే పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందన్నారు. జిల్లా అధ్యక్షుడు మాధవరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎన్. శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి రాజు, కోశాధికారి మన్యం, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు అంజి, సీనియర్ జర్నలిస్టులు నాగేంద్రాచారి, శ్రీనివాసరావు, వనపర్తి పట్టణ యూనియన్ అధ్యక్షుడు తైలం అరుణ్‌ రాజ్, పెబ్బేరు, శ్రీరంగాపురం, రేవల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు బాలవర్ధన్, బాలరాజు, హరీష్, కార్యదర్శి నవీన్, గణేష్, రామకృష్ణ, దామోదర్, అశోక్, రవీందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>