సామినేని కేసు.. భట్టి రాజీనామా, సీపీని బదిలీకి సీపీఎం డిమాండ్

కలం, కారేపల్లి: సీపీఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ సామినేని రామారావు హత్య కేసులో అసలైన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని సీపీఎం (CPM) నాయకులు డిమాండ్ చేశారు. హత్య జరిగి ఏడాది కావస్తున్నా విచారణలో సరైన పురోగతి లేదన్నారు. కేసును పక్కదారి పట్టించేలా పోలీసుల వ్యవహారశైలి ఉందని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి మండల సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఈ కార్యక్రమానికి సీపీఎం సింగరేణి మండల కార్యదర్శి కే. నరేంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సామినేని రామారావు (Samineni Rama Rao Case) హత్య కేసుతో సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేసి, అసలైన నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వెంటనే ఆయనను బదిలీ చేసి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ద్వారా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

హత్య జరిగి సంవత్సరం కావస్తున్నా పోలీసుల విచారణలో ఆశించిన ఫలితం కనిపించడం లేదని సీపీఎం నాయకులు విమర్శించారు. కట్టుకథలతో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వారి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని అన్నారు.

ఈ కేసులో నైతిక బాధ్యత వహిస్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెంటనే రాజీనామా చేయాలని, ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను బదిలీ చేసి అసలైన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు ముక్క సీతారాములు, పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు రేకల మంగయ్య, మండల కమిటీ సభ్యులు ముండ్ల ఏకాంబరం, శ్రీరాములు, తిరుపయ్య, సైదులు, కోటయ్య, సంపత్, మంద శ్రీను, తగరబాబు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>