కలం, జోగులాంబ గద్వాల: మల్దకల్ (Maldakal) మండలం శేషంపల్లి స్టేజ్ సమీపంలో మల్దకల్ – అయిజ ప్రధాన రహదారిపై శుక్రవారం ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్న (Bike Accident) ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. మల్దకల్ ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం… అయిజ మండలం సీటిపాడు గ్రామానికి చెందిన కిరణ్ కుమార్, మహేష్ (25), ఇద్దరూ కలిసి బైక్‌పై గద్వాలకు వస్తున్నారు. అదే సమయంలో కర్నూల్ జిల్లాకు చెందిన లోకేష్, రవికుమార్, అయిజకు చెందిన ఏసన్న ముగ్గురు కలిసి బైక్ పై మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలో జరిగిన ఓ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై తిరిగి బైక్ పై అయిజ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో శేషంపల్లి స్టేజ్ సమీపంలో ఎదురెదురగా వస్తున్న రెండు బైక్‌లు బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో బైక్‌లపై ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు. మల్దకల్ పోలీసులు, స్థానికులు గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆంబులెన్స్‌లో గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మహేష్ (25) మరియు లోకేష్ (25) గద్వాలజిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కిరణ్ కుమార్, రవికుమార్, ఏసన్నలకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అయిజ మండలం సీటి పాడుకు చెందిన కిరణ్ కుమార్ బైక్‌ను నడుపుతూ ముందుగా వస్తున్న బస్సును ఓవర్ టేక్ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు, బాధితులు తెలిపారు. మల్దకల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

