కలం, ఖమ్మం బ్యూరో: డిప్యూటీ సీఎం భట్టి డైరెక్షన్‌లోనే పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కట్టుకథలు అల్లుతున్నారని సీపీఎం (CPM) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సామినేని రామారావు (Samineni Rama Rao) మర్డర్‌ను పూర్తిగా పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు సీపీఎం ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు.
ప్రశ్నించినందుకే హత్య చేశారు..
రామారావు హత్యలో అసలు హంతకులను, రౌడీలను, గూండాలను కాపాడేందుకు సీపీ సునీల్ దత్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని సీపీఎం నాయకులు మండిపడ్డారు. ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సమక్షంలో తయారు చేసిన స్క్రిప్ట్‌నే ఖమ్మంలో సీపీ అమలు చేస్తున్నారని ఆరోపించారు. రామారావు రిమాండ్ రిపోర్ట్‌లో 14 మంది సాక్షులను విచారించామని చెబుతున్నప్పటికీ, ఇద్దరు ఉద్యోగులు మినహా మిగిలిన వాళ్లంతా వేరే పేర్లు చెబుతున్నారని స్పష్టం చేశారు.
భట్టి విక్రమార్క చెబితేనే సీపీ ఈ అబద్ధపు కథలు అల్లుతున్నారని విమర్శించారు. జిల్లాలోని (Khammam) మధిర నియోజకవర్గంలో హత్యాకాండ ద్వారా రాజకీయాలు చేస్తున్నారని, భట్టి అన్యాయాలు, అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే సామినేని రామారావును హత్య చేశారని ఆరోపించారు.
ఐపీఎస్ వ్యవస్థకే కళంకం తెచ్చేలా తీరు..
హత్యకు నెల రోజుల ముందు రామారావు చేసిన పాదయాత్ర ప్రసంగ ఆడియోను ఈ సందర్భంగా విలేకరులకు వినిపించారు. ఏడాది గడిచినా హంతకులను అరెస్ట్ చేయకుండా పోలీసు శాఖ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు సీపీ కొత్త నాటకాలకు తెరలేపారని మండిపడ్డారు. జిల్లాలో ఐపీఎస్ వ్యవస్థకే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్న సీపీ సునీల్ దత్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
రామారావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు, అసలు దోషులు పట్టుబడే వరకు సీపీఎం పార్టీ తరఫున రాజీలేని పోరాటం, తీవ్రస్థాయిలో న్యాయపోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. త్వరలో సీఎంను, డీజీపీని కలిసి సిట్ విచారణ కోరతామని, హంతకులతో పాటు వారిని రక్షించే అధికారులను కూడా బోనులో నిలబెడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, బండి పద్మ, కళ్యాణం వెంకటేశ్వరరావు, మాదినేని రమేష్, విక్రమ్, పార్టీ సీనియర్ నాయకులు చింతలచెర్వు కోటేశ్వరరావు, మధిర డివిజన్ కార్యదర్శి ఎం. గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

