కలం, యాదగిరిగుట్ట : యాదాద్రి క్షేత్ర వైభవాన్ని మరింత ఇనుమడింపజేసేలా మరో నూతన నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక స్వాగతం పలికేలా రాయగిరి గ్రామం వద్ద స్వామివారి స్వాగత తోరణం (Welcome Arch) (ఆర్చ్ గేట్) నిర్మాణానికి భూమిపూజ (Bhoomi Pooja) కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాదాద్రి క్షేత్ర అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ఈ నిర్మాణం క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది.
స్వామివారి వైభవాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు కానున్న ఈ స్వాగత తోరణం భక్తులకు ఆధ్యాత్మిక స్వాగత చిహ్నంగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, దేవస్థాన చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి పాల్గొని శాస్త్రోక్తంగా నిర్వహించిన భూమిపూజలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన బోర్డు సభ్యులు, ఎమ్మెల్యే గడ్డం వినోద్, టి. విజేందర్ గౌడ్, లక్ష్మీనారాయణ, ఈశ్వరమ్మ, గుండు మల్లయ్య, దేవస్థాన కార్యనిర్వహణాధికారి జె. భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

