కలం, వెబ్ డెస్క్: ఏపీలో పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల సంఘం (AP State Election Commission) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో పలు షరతులు కూడా విధిస్తూ సెర్ప్ సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పింఛన్లు పొందుతున్నవారికే ఇవ్వాలని.. కొత్త లబ్ధిదారులను ఎట్టి పరిస్థితుల్లో చేర్చవద్దని స్పష్టం చేసింది. అంతేగాకుండా పింఛన్ మొత్తంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దని కూడా సూచించింది. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సంబంధిత విభాగం అధికారులు, సిబ్బంది మాత్రమే పాల్గొనాలని.. మరొకరి ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీకి ఎలాంటి ఆటంకాలు కలగొద్దని పేర్కొంది.
ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ..
పింఛన్ల పంపిణీలో టీడీపీ సహా కూటమి పార్టీల నేతలు పాల్గొనకుండా నిరోధించాలని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికార పార్టీల నేతలు తమ ప్రచారానికి ఉపయోగించుకుని.. ఎన్నికల్లో లబ్ధి పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మాత్రమే పింఛన్ల పంపిణీలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

