కలం, యాదగిరిగుట్ట : రానున్న ఖమ్మం–వరంగల్–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను (Graduates MLC Elections) దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ (BRS) ఎన్నికల సన్నద్ధతపై దృష్టి సారించింది. ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయడం, అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా క్షేత్రస్థాయిలో విస్తృత చర్యలు చేపట్టడమే లక్ష్యంగా పార్టీ నాయకత్వం కార్యాచరణకు సిద్ధమైంది.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని ఎస్ఎల్ఎన్ఎస్ ఫంక్షన్ హాల్లో ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పార్టీ నాయకులకు ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు కీలకమని భావించిన పార్టీ శ్రేణులు, అర్హులైన పట్టభద్రులను గుర్తించి వారికి నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. గ్రామాలు, మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని దృష్టి సారించారు. ఎన్నికల ఇంచార్జులు బాధ్యతాయుతంగా వ్యవహరించి క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని నాయకత్వం సూచించింది.
పట్టభద్రుల ఓటరు జాబితాలో అర్హులైన వారి పేర్లు చేరేలా అప్రమత్తంగా ఉండటంతో పాటు, ఎన్నికల ప్రక్రియపై విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరాన్ని ఈ సమావేశం ప్రధానంగా చర్చించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ బండ నరేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డితో పాటు నియోజకవర్గ నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

