అశ్వారావుపేటలో విద్యుత్ పనులపై సీఎండీ సమీక్ష

కలం, ఖమ్మం బ్యూరో : వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ(TGNPDCL CMD) కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్ పరిధిలో విద్యుత్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం అశ్వారావుపేట (Aswaraopeta) ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, పలు విద్యుత్ సబ్‌స్టేషన్లు, నూతన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి సమీక్షించారు.

ఈ సందర్భంగా అశ్వారావుపేట-2 పరిధిలోని నందమూరి కాలనీలో నిర్మిస్తున్న 220/132, 33/11 కేవీ నూతన సబ్‌స్టేషన్ పనులను పరిశీలించి, వాటిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అశ్వారావుపేటలోని 220/132 కేవీ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా పటిష్టతకు చేపట్టిన అదనపు 33 కేవీ సామర్థ్య సరఫరా కొనసాగింపు పనులతో పాటు, 33/11 కేవీ నారాయణపురం సబ్‌స్టేషన్ సరఫరా తీరుతెన్నులను పరిశీలించారు. అలాగే అశ్వారావుపేటలో సుమారు 17 గుంటల విస్తీర్ణంలో ప్రతిపాదించిన నూతన డివిజన్ కార్యాలయ భవన స్థలాన్ని పరిశీలించారు. టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. ఆసుపాక 400/220 కేవీ సబ్‌స్టేషన్ నుంచి 33 కేవీ విద్యుత్ సరఫరా పనులకు సంబంధించిన సాంకేతిక అంశాలను సమీక్షించి, నిర్ణీత లక్ష్యాలను సాధించాలని అధికారులకు తెలిపారు.

ఈ పర్యటన సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో సీఎండీ సమావేశమయ్యారు. ఈ ప్రాంతంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, సబ్‌స్టేషన్ల ఏర్పాటు, సరఫరా వ్యవస్థ మెరుగుదల వంటి అంశాలపై చర్చించారు. పనుల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా, ప్రతి అభివృద్ధి పనిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>