కలం, వెబ్ డెస్క్: మియాపూర్ భూముల వివాదం(Miyapur Land Dispute)లో సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ విజయం దక్కింది. హెచ్ఎండీఏ(HMDA)కు చెందిన సుమారు రూ.20 వేల కోట్ల విలువైన 550 ఎకరాల భూములు తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ సుందరేశ్తో కూడిన ద్వి సభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2003లో హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన అన్ని రకాల అప్పీళ్లను కొట్టేసింది. దీంతో 23 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. ప్రభుత్వానికి చెందిన విలువైన భూములు ప్రైవేట్ వ్యక్తులు దక్కించుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఇన్నేళ్లుగా ప్రభుత్వ భూమిని పరిరక్షిస్తూ వస్తున్న అధికారులను అభినందించింది.
అసలు ఏంటీ వివాదం..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్లోని సర్వే నెంబర్లు 100, 101లో సుమారు 550 ఎకరాల భూమిపై వివాదం మొదలైంది. నిజాం కాలంలో ఈ భూములకు జాగీర్ధార్గా ఉన్న కైసరుద్దీన్ వారసురాలు అమీరున్నీసా నుంచి తాము కొనుగోలు చేసినట్లు పార్థసారధి, సువిశాల్ జైన్ అనే వ్యక్తులు వాదిస్తున్నారు. ఈ మేరకు తమకు పవర్ ఆఫ్ అటార్నీ ఉందని తెలిపారు. 2003లో శేరిలింగంపల్లి తహసీల్దార్ ఈ అటార్నీ హోదాను రద్దు చేసి.. ఆ భూములు ప్రభుత్వానివే అని రికార్డుల్లో పొందుపరిచారు.
ఈ నిర్ణయాన్ని పార్థసారధి, సువిశాల్ జైన్ హైకోర్టులో సవాల్ చేయగా.. కోర్టు తహసీల్దార్ నిర్ణయాన్ని సమర్థించింది. కైసరుద్దీన్కు అప్పట్లోనే భూములకు సంబంధించిన పరిహారం చెల్లించనందున వాటిపై ఆయనకు, వారసులకు ఎలాంటి అధికారం లేదని తేల్చింది. హై కోర్టు తీర్పును పార్థసారధి, సువిశాల్ జైన్ సుప్రీంలో సవాల్ చేయగా.. ఆ భూములు తెలంగాణ ప్రభుత్వానివే అని సంచలన తీర్పు వెలువరించింది.
Also Read : క్రమశిక్షణ కమిటీ చెంతకు అనిరుధ్ రెడ్డి వ్యవహారం!
Follow Us On: Instagram

