కలం, జగిత్యాల : గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలిగిపోయి సంతోషం కలుగుతుందని అందుకు ప్రతి ఒక్కరూ పూజించాలని పొలాస సహస్ర లింగాల ఆలయ (Sahasra Lingala Temple) ఫౌండర్ చైర్మన్ నలమాసు గంగాధర్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలోని ప్రసిద్ధ సహస్ర లింగాల దేవాలయంలో గురువారం సంకష్టహర చతుర్థి (Sankashti Hara Chaturthi) సందర్భంగా మహాగణపతికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, గరిక, మందార పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఫౌండర్ చైర్మన్ నలమాసు గంగాధర్ మాట్లాడుతూ..సంకష్టహర చతుర్థి చాలా పవిత్రమైన రోజని, మహాగణపతికి అభిషేక పూజలు నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయన్నారు. గణపతిని పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోవడమే కాకుండా, భక్తులందరికీ ఉన్న సమస్యలు, గ్రహ దోషాలు తొలగిపోయి ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారని తెలిపారు.
భక్తులు అందరికీ శుభం కలగాలని మహాగణపతిని వేడుకున్నామని గంగాధర్ వివరించారు. ప్రతి సంకష్టహర చతుర్థికి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించి తరించాలని గంగాధర్ కోరారు. ఈ కార్యక్రమంలో కొయ్యేడ రమేష్, కొత్త ప్రతాప్, కొయ్యేడ చంద్రశేఖర్, గంప రమణ, మహిళలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

