కలం, సారంగాపూర్ : బాలల హక్కులను పరిరక్షిస్తూ, వారిపై జరిగే లైంగిక వేధింపులు, నేరాలు, బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నిఖిత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సారంగాపూర్ (Sarangapur) మండలం బీరవెల్లి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ (Surakshit Bachpan Abhiyan) కార్యక్రమం నిర్వహించి బాలల భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నిఖిత మాట్లాడుతూ.. పిల్లలపై నేరాలు జరిగినట్లు తెలిసినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, బాధిత బాలల వ్యక్తిగత వివరాలు బయటపెట్టకుండా గోప్యతను కాపాడాలని సూచించారు. బాలల సమస్యలను గుర్తించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, బాధితులకు రక్షణ, కౌన్సెలింగ్, న్యాయ సహాయం అందించడంలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్, న్యాయవాది షేర్ నరేందర్, సర్పంచ్ బ్యాగరి గంగవ్వ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

