NHM ఉద్యోగులపై ఎందుకింత నిర్ల‌క్ష్యం?: టీడీపీ నాయ‌కురాలు జ్యోత్స్న

కలం, నాగర్ కర్నూల్: దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్‌హెచ్ఎం ఉద్యోగుల (NHM Employees) రెగ్యులరైజేషన్ సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎన్‌హెచ్ఎం అడ్వైజర్ ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి (Jyothsna Tirunagari) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎన్‌హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె శిబిరాన్ని గురువారం సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు సమ్మె ప్రారంభించిన వారం రోజుల్లోనే ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపిందన్నారు. 30 శాతం వేతనాల పెంపుతోపాటు రెగ్యులరైజేషన్ అంశంపై కమిటీ ఏర్పాటు చేసి లిఖితపూర్వక హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. అక్కడ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతున్నప్పుడు తెలంగాణలో ఎందుకింత నిర్లక్ష్యమని ప్రశ్నించారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఉద్యోగుల సమస్యలు పట్టవా? ముఖ్యమంత్రి దృష్టికి వారి ఆవేదన చేరలేదా? అని నిలదీశారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కులు సాధించే వరకు వారికి అండగా ఉంటానని ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి భరోసా ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి ఉద్యోగుల సమస్యలను తీసుకెళ్లేందుకు టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ప్రత్యేక లేఖలు రాస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే వచ్చే బుధవారం నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు అధైర్యపడకుండా ఐక్యతతో పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ పాషా, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు బాలకృష్ణ, సుధాకర్, చంద్రయ్య, రామకృష్ణతో పాటు పలువురు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు పాల్గొన్నారు. తమ పోరాటానికి సంఘీభావం తెలిపి, సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని భరోసా ఇచ్చిన ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి ఎన్ హెచ్ ఎం జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>