కలం, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల (Sheep, Goat Rearers) సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ రోజు హిమాయత్ నగర్ అమృత ఎస్టేట్స్ చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నుండి హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ.. గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
చేనేత,గీత వృత్తిదారులకు ఇచ్చినట్లుగా గొల్ల కురుమలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని, ఆసరా పెన్షన్ ను 5వేలకు పెంచి అమలు జరపాలన్నారు . సమస్యల పరిష్కారానికై వృత్తిదారులంతా ఐక్యంగా పోరాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ జనగణనలో కులగణన చేయకుండా మోసం చేస్తున్నదని కులగణన నిర్వహించి కులాల లెక్కలు తీసి జనాభా ప్రాతిపదికన వారి అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడాలని లేకుంటే బీసీ ఉద్యమాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
గొర్రెలు మేకలని అడవిలో మేపుకొనుటకు కేంద్ర ప్రభుత్వం పాలసీ ప్రకటించాలని దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ 5 లక్షల నుండి 10 లక్షల లోపు ఎలాంటి షరతులు లేకుండా గొల్ల కురుమలకు రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. అంతేకాక రాష్ట్ర కేబినెట్‌లో గొల్ల కురుమలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలనన్నారు.
జీవో నెంబర్ 559, 1016 లను రాష్ట్ర ప్రభుత్వం సవరించి తెలంగాణ రాష్ట్రంలోనిప్రతి గ్రామంలో గొర్రె పెంపకం దారులకు గొర్రెలు మేకల మేత కొరకు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే కేటాయించాలని బుచ్చన్న యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోడంగి శ్రావణ్ కుమార్ యాదవ్, బాలయ్య యాదవ్, జిల్లాల అధ్యక్షులు చిల్లారపు సంతోష్ యాదవ్, గజ్జి రమేష్ యాదవ్ వేల్పుల సారంగపాణి యాదవ్,అందే అశోక్ యాదవ్, సంఘం నాయకులు మద్దూరి గట్టయ్య,దాడి రాజబాబు యాదవ్, కేశవేణి సత్యనారాయణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

