కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో పలు చోట్ల బియ్యం డీలర్లపై విజిలెన్స్ అధికారులు దాడులు (Vigilance Raids) నిర్వహించారు. ఈ తనిఖీల్లో షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. కర్మన్‌ఘాట్‌లోని ఓ బియ్యం డీలర్ 26 కిలోల రైస్ బ్యాగులో రెండు కిలోలు తక్కువగా నింపి విక్రయిస్తున్నారని గుర్తించారు. అంతేగాకుండా, సన్న బియ్యంలో దొడ్డు బియ్యం, పాలిష్ చేసిన బియ్యాన్ని కలిపేసి బ్రాండ్ల పేరిట కిలోకు రూ.80 నుంచి రూ.100 వరకు కస్టమర్లకు అమ్ముతూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. బియ్యం తూకాల్లో తేడాలతో పాటు పత్రాలు, బిల్లులు, ప్యాకేజింగ్ నిబంధనలు కూడా పాటించడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇలా అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లపై విచారణ జరుగుతోందని.. అనంతరం వారిపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్పీ రామ్ కుమార్ తెలిపారు.
బృందాలుగా విడిపోయి..
ఎల్ నినో నేపథ్యంలో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. కస్టమర్ల అవసరాలను క్యాష్ చేసుకుంటున్న కొందరు బియ్యం డీలర్లు అక్రమాలతో చెలరేగుతూ.. అందినకాడికి దోచుకుంటున్నారు. హైదరాబాద్‌లో దందా మరింత ఎక్కువగా జరుగుతోందనే నిఘా వర్గాల సమాచారంతో సివిల్ సప్లైస్, విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులు 10–12 ప్రత్యేక బృందాలుగా ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకస్మిక తనిఖీలు ఉంటాయని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు.

