కలం, కరీంనగర్ : పంటలు లేక, తీవ్రమైన నీటి కరువుతో అల్లాడుతున్న తిమ్మాపూర్ (Thimmapur) మండలాన్ని ప్రభుత్వం వెంటనే “కరువు మండలం”గా (Drought Mandal) ప్రకటించి, నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిమ్మాపూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండల బీజేపీ శాఖ అధ్యక్షులు చింతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం రోజున ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట హైదరాబాద్ రాజీవ్ రహదారి వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వానికి , స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో వల్ల రాజీవ్ రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసులు జోక్యం చేసుకొని బీజేపీ నాయకులను కార్యకర్తలతో రాస్తారోకో విరమింప చేశారు. అనంతరం బీజేపీ నేతలు మండల తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల ప్రకటనపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అలాగే స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “మండలంలో నీటి కరువు రావడం వల్ల రైతులు సాగుకు దూరమై తీవ్ర మనోవేదనకు గురవుతున్నారనీ ,పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు మున్నీరు అవుతుంటే, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి ఏం చేస్తున్నారు? నియోజకవర్గంలో తాండవిస్తున్న కరువు పరిస్థితులు, రైతుల అవస్థలు ఎమ్మెల్యే కంటికి కనిపించడం లేదా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో తిమ్మాపూర్ మండలం లేకపోవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరువు మండలాల జాబితాను కేవలం మొక్కుబడిగా మాత్రమే ప్రకటించిందన్నారు. కరువు మండలాలను ఎంపిక చేయడానికి ఉపయోగించిన అధికారిక గణాంకాలు సరిగా లేవనీ,జాబితాను చూస్తేనే ఇది ఎంత అశాస్త్రీయంగా తయారుచేశారో అర్థమవుతోందనీ ఘాటుగా వ్యాఖ్యానించారు.
తీవ్రమైన లోటు వర్షపాతం నమోదు కావడం, పొలాలన్నీ బీళ్లుగా మారి రైతులు నీటికి తల్లడిల్లుతున్నా ఆ మండలాలను జాబితాలో చేర్చకపోవడం బాధాకరమన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో అనేక మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదై , సాగునీరు లేక తీవ్ర కరువు పరిస్థితులు తలెత్తాయన్నారు. ఆయా మండలాలు కరువు జాబితాలోకి వచ్చే అర్హత కలిగి ఉన్నాయనీ, అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి వచ్చి రైతులతో మాట్లాడితేనే అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు.
ముఖ్యంగా ఆ మండలాలను తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలనీ, ఎండిపోయిన పంటలకు తగిన నష్టపరిహారం చెల్లించడంతో పాటు, రైతాంగానికి వెంటనే ప్రత్యామ్నాయ సాగునీటి సౌకర్యాలు కల్పించాలనీ ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు రాజకీయ లబ్ధిని, రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, వాస్తవికత ఆధారంగా కరువు ప్రభావిత రైతులకు భరోసా కల్పించే చర్యలు చేపట్టాలనీ, రైతుల సమస్యలపై ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించకపోతే, బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తక్షణం తిమ్మాపూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, మాజీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వర చారి, జిల్లా నాయకులు, మావురపు సంపత్,బూట్ల శ్రీనివాస్, బోనాల మోహన్, మండల నాయకులు గొట్టుముక్కల తిరుపతిరెడ్డి, తమ్మనవేని రాజు, తూర్తి సంతోష్, వేల్పుల ఓదెలు, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, బుర్ర శ్రీనివాస్ గౌడ్, పడాల శ్రీనివాస్ గౌడ్, గడ్డం అరుణ్, రాపర్తి రవి, ఎలుకపల్లి స్వామి, చింతం లక్ష్మణ్, దొనపాటి ప్రదీప్ రెడ్డి, బుడిగ మహేష్, బుడిగ నరేష్, రామిడి మహేందర్ రెడ్డి, ఈశ్వర చారి, దురిశెట్టి అజయ్, కన్నం సాయి కృష్ణ కొక్కిస రమేష్, నరేష్ రవి, నరసయ్య,వేల్పుల నరేష్,ప్రశాంత్.పలువురు మండల నాయకులు రైతులు పాల్గొన్నారు.

