కలం, నిర్మల్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల నిరవధిక సమ్మె గురువారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న ఉద్యోగులు, ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ (NHM Employees Strike) నిర్వహించారు. దీక్షా శిబిరం నుంచి ఏఎన్‌ఎంలు, ఆయుష్ వైద్యులు మినీ ట్యాంక్‌బండ్ వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను, పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.

