కలం, స్పోర్ట్స్: కజకిస్తాన్‌లోని అస్తానా వేదికగా గురువారం నుంచి ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ (World Wrestling Championship) పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో భారత స్టార్ రెజ్లర్, ఆసియా గేమ్స్ స్వర్ణ విజేత సుజీత్ కల్కల్ (Sujeet Kalkal) వేట ప్రారంభించనున్నాడు. 65 కేజీల కేటగిరీలో పోటీ పడుతున్న సుజీత్‌కు రెండో సీడింగ్ లభించింది. గతంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇరాన్ రెజ్లర్ రహ్మాన్ అమోజాద్తో జరిగిన పోరు సుజీత్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూడలేదు. వరుసగా 19 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాడు. తిరానా, జాగ్రెబ్ టోర్నీలతో పాటు ఆసియన్ ఛాంపియన్షిప్, ఆసియా గేమ్స్‌లలో పసిడి పతకాలు గెలుచుకున్నాడు.
ఒలింపిక్ ఛాంపియన్ కొటారో కియోకాను కూడా ఆసియా గేమ్స్‌లో ఓడించి తన సత్తా చాటాడు. గత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బజ్రంగ్ పునియా రజత పతకం సాధించాడు. ఇప్పుడు కోచ్ షాకో బెంటినిడిస్ మార్గదర్శకత్వంలో సుజీత్ (Sujeet Kalkal) తన దాడి చేసే శైలిని మరింత మెరుగుపరుచుకున్నాడు. ప్రత్యర్థులపై నిరంతరం దాడి చేయాలని కోచ్ చెప్పిన సూచన తన ఆటతీరును మార్చిందని సుజీత్ తెలిపాడు. ఆసియా గేమ్స్ ఫైనల్లో అన్ని దాడులు సక్సెస్ కావడం పాయింట్లు సాధించడానికి దోహదపడిందని పేర్కొన్నాడు.
ఈ టోర్నీలో ఆసియా గేమ్స్ విజేత అమన్ సెహ్రావత్ ఆడటం లేదు. అతని గైర్హాజరీలో 57 కేజీల విభాగంలో రాహుల్‌కు మంచి అవకాశం లభించింది. అలాగే 74 కేజీల విభాగంలో సాగర్ జగ్లాన్ బరిలోకి దిగుతున్నాడు. రాహుల్, నిఖిల్, సుజీత్ కల్కల్, విశాల్ కాళీరామన్, సాగర్ జగ్లాన్, సౌరభ్ యాదవ్, పుష్పేందర్ దలాల్, సచిన్, విక్కీ, జస్పోరన్ సింగ్‌లతో కూడిన 10 మంది సభ్యుల ఫ్రీస్టైల్ జట్టును భారత్ బరిలోకి దించుతోంది.
Also Read : పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ అనుమానాస్పద మృతి!
Follow Us On : WhatsApp

