కలం, ఖమ్మం బ్యూరో: తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న నేపథ్యంలో, జిల్లా ప్రజలు, రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) పిలుపునిచ్చారు. తుఫాన్ ముప్పు పొంచి ఉన్నందున ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అధికార యంత్రాంగం తక్షణ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ కారణంగా సంభవించే నష్టాలను నివారించేందుకు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మరోవైపు, కొంతకాలంగా వేధిస్తున్న ఎల్‌నినో (El Nino) ప్రభావం నుంచి ఈ వర్షాల (Heavy Rains) ద్వారా తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ వర్షపు నీటిని వ్యర్థం చేయకుండా, భవిష్యత్తు అవసరాల కోసం ఒడిసిపట్టి నిల్వ చేసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలాఉంటే, ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు. అకాల వర్షాలకు పంటలు తడిసి నష్టపోకుండా అన్నదాతలు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
Also Read : అర్నబ్ తుఫాన్ ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి
Follow Us On: X(Twitter)

