కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులపై పశువులను విచ్చలవిడిగా వదిలితే వాటి యజమానులపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ రవిబాబు (Ravi Babu) హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని ప్రధాన రహదారులపై సంచరిస్తున్న పశువులను(Cattle on Roads) గుర్తించి, వాటి యజమానులకు జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రోడ్లపై పశువుల సంచారంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటమే కాకుండా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. పశువుల యజమానులు వాటిని రోడ్లపై వదలకుండా తమ సొంత స్థలాల్లో ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రోడ్లపై సంచరించే పశువులన్నింటినీ గోశాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

