కలం, నిర్మల్: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల (Mid Day Meal Workers) పెండింగ్ బిల్లులు, వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేపీఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి (Alleti Maheshwar Reddy) నివాసం ఎదుట ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు భూక్యా రమేష్ మాట్లాడుతూ.. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన వంట బిల్లులను వెంటనే చెల్లించాలని, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార పథకాన్ని మధ్యాహ్న భోజన కార్మికులకే (Mid Day Meal Workers) అప్పగించాలని కోరారు. సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కోడిగుడ్లు, గ్యాస్, ఇతర నిత్యావసర సరుకులను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
Also Read : విద్యార్థులకు ఈ-వ్యర్థాల నిర్వహణపై అవగాహన.. క్విజ్ పోటీలు నిర్వహణ
Follow Us On: Youtube

