ఢిల్లీ టూర్ ఎఫెక్ట్.. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు బ్రేక్?

కలం, తెలంగాణ బ్యూరో: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు ప్రక్రియ (MLC Voter Registration)ను వేగవంతం చేయాల్సిన కీలక సమయంలో కాంగ్రెస్‌ నేతలు ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. దీంతో నమోదు ప్రక్రియకు బ్రేకులు పడే పరిస్థితి కనిపిస్తోంది. నవంబరు 1న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన ర్యాలీ కోసం ఈ నెల 30 నుంచే పలువురు నేతలు హస్తినకు వెళ్లనుండటం, నవంబరు 6తో ఓటరు నమోదు గడువు ముగియనుండటంతో పార్టీ లక్ష్యాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదును సీరియస్‌గా తీసుకోవాలని ఇటీవల ప్రజాభవన్‌లో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్‌ స్థానంలో 2021లో 5,05,565 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 2,44,349 మంది మాత్రమే నమోదయ్యారని వెల్లడించారు.

గత ఎన్నికల నాటి సంఖ్యతో పోలిస్తే ఇది దాదాపు 49 శాతం మాత్రమే. మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానంలో 2021లో 5,31,268 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 1,91,365 మంది మాత్రమే నమోదయ్యారని సీఎం పేర్కొన్నారు. గత ఎన్నికల నాటి సంఖ్యతో పోలిస్తే ఇది దాదాపు 36 శాతం. రెండు స్థానాల్లోనూ ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విజయం సాధించేలా క్షేత్రస్థాయి కార్యకర్తలతో సహా అందరూ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ముఖ్య నేతలు పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఓటరు నమోదును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

నాలుగు రోజులు ఢిల్లీలోనే..

‘ఓటు బచావో.. దేశ్‌ బచావో(Vote Bachao Desh Bachao)’ నినాదంతో కాంగ్రెస్‌, ఇండియా కూటమి పార్టీలు నవంబరు 1న ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నాయి. సర్‌‌కు వ్యతిరేకంగా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఈ కార్యక్రమం చేపట్టనున్నాయి. తెలంగాణ నుంచి పది నుంచి పదిహేను వేల మందిని సమీకరించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని ముఖ్య నేతలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లలో బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు నేతలు తమ అనుచరుల కోసం విమాన టికెట్లు కూడా బుక్‌ చేశారు. ఈ నెల 30న ఢిల్లీకి వెళ్లి, నవంబరు 1న ర్యాలీలో పాల్గొన్న అనంతరం నవంబరు 2 లేదా 3న హైదరాబాద్‌కు తిరిగి రావాలని పలువురు నేతలు భావిస్తున్నారు.

కీలక సమయంలో..

గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదు(MLC Voter Registration)లో కీలక పాత్ర పోషించాల్సిన నేతలు, కార్యకర్తలు నాలుగు రోజుల పాటు ఢిల్లీ కార్యక్రమంలో నిమగ్నమైతే క్షేత్రస్థాయిలో నమోదు వేగం తగ్గే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రెండు స్థానాల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల నమోదు తక్కువగా ఉండటంతో.. మిగిలిన ఈ సమయంలోనే మరింత మందిని ఓటర్లుగా చేర్పించాల్సిన లక్ష్యం వారి ముందుంది.

ఈ తరుణంలో పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లడం నమోదు ప్రక్రియకు ఆటంకంగా మారుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఢిల్లీ కార్యక్రమానికి వెళ్లని నేతలకు ఆయా ప్రాంతాల్లో నమోదు బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీకి వెళ్లిన నేతలు తిరిగి వచ్చే వరకు స్థానిక నాయకులు నమోదు ప్రక్రియను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేయవచ్చని పేర్కొంటున్నాయి. నవంబరు 6 చివరి గడువు కావడంతో.. నిరసన ర్యాలీతో పాటు గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదుపైనా పార్టీ ఏ మేరకు దృష్టి సారిస్తుందన్నది కీలకంగా మారింది.

Also Read : నేడే అఖిలపక్షం: కరువుపై సర్కార్‌ కీలక కసరత్తు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>