నేడే అఖిలపక్షం: కరువుపై సర్కార్‌ కీలక కసరత్తు!

కలం, తెలంగాణ బ్యూరో: ఎల్‌ నినో ప్రభావం, లోటు వర్షపాతం, కరువు పరిస్థితులపై చర్చించేందుకు ప్రభుత్వం నేడు అఖిలపక్ష సమావేశం (Telangana All Party Meeting) నిర్వహించనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించి, వాటి ఆధారంగా తదుపరి కార్యాచరణ రూపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. సమావేశానికి బీజేపీ, బీఆర్‌‌ఎస్‌ హాజరయ్యేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

పార్టీల అభిప్రాయాల మేరకు కార్యాచరణ

రాష్ట్రంలో వర్షపాతం లోటు, ఎల్‌ నినో ప్రభావంతో మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులు, ప్రజలపై చూపే ప్రభావాలపై సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగునీటి అవసరాలకు విద్యుత్‌ సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక వంటి అంశాలపై రాజకీయ పార్టీల సూచనలు తీసుకోనున్నారు. కరువు పరిస్థితులు తీవ్రమైతే ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం, వ్యవసాయ రంగంపై వర్షాభావ ప్రభావాన్ని తగ్గించడం, రైతులకు అవసరమైన సహాయం అందించడం వంటి అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

బీజేపీ నుంచి ఏలేటి, మల్కా

బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు ఆదేశాల మేరకు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అఖిలపక్ష సమావేశంలో పాల్గొని పార్టీ వైఖరిని వెల్లడించనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో సాగునీటి ఎద్దడి, విద్యుత్‌ కోతలు, పంట నష్టాలు, తాగునీటి సమస్యలపై బీజేపీ చేసిన ఒత్తిడితోనే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందని ఆ ప్రకటనలో పేర్కొంది. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కాలయాపన చేయకుండా కరువు మండలాలను ప్రకటించి, రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేసింది. రైతాంగ సంక్షేమం, ప్రజల తాగునీటి అవసరాల పరిరక్షణే లక్ష్యంగా నిర్మాణాత్మక సూచనలు, సలహాలను ప్రభుత్వం ముందు ఉంచుతామని తెలిపింది.

బీఆర్‌‌ఎస్‌ నుంచి ఎవరు?

అఖిలపక్ష సమావేశంలో పాల్గొనే అంశంపై బీఆర్‌‌ఎస్‌లో చివరి వరకు చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమావేశానికి హాజరయ్యేందుకు సానుకూలంగా ఉన్నప్పటికీ, పార్టీ తరఫున ఎవరిని పంపాలనే దానిపై స్పష్టత రాలేదని సమాచారం. అధినేత కేసీఆర్‌ ఎవరిని సూచిస్తారనేది తేలాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>