కాంగ్రెస్‌ తప్పుడు నిర్ణయాలతో సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌పై లక్ష కోట్ల అప్పు: హరీశ్‌రావు

క‌లం, మెద‌క్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాల వల్ల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ (Civil Supplies Corporation) ఏకంగా రూ. లక్ష కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని , కాంగ్రెస్ పాలనలో బకాయిలు, బిల్లులు రావాలంటే ప్రాణాలు వదలాల్సిందేనా అని మాజీ మంత్రి, హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లో రాష్ట్రవ్యాప్త రేషన్ డీలర్ల సమావేశానికి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

33 జిల్లాల నుంచి తరలివచ్చిన రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. “బిల్లుల కోసం తాను చచ్చిపోవడానికైనా సిద్ధమేనని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అంటుంటే, డీలర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజు చెబుతున్నారు. ఈ కాంగ్రెస్ రాజ్యంలో చచ్చిపోతేనే పనులు అవుతాయా?” అని ప్రశ్నించారు.

గోదాములు, షాపుల్లో గత 16 నెలలుగా మూలుగుతున్న రూ. 600 కోట్ల విలువైన దొడ్డు బియ్యాన్ని పురుగులు, పందికొక్కుల పాలు చేశారని మండిపడ్డారు. సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్ కోసం రూ. 100 కోట్లు, కాంపౌండ్ వాల్ కోసం రూ. 18 కోట్లు ఖర్చు చేయడానికి, అందాల పోటీలు, ఫుట్‌బాల్ హంగామాకు ప్రభుత్వం వద్ద డబ్బులుంటాయి కానీ.. రాష్ట్రంలో ఉన్న 17,200 మంది రేషన్ డీలర్లకు నెలకు రూ. 10 కోట్ల గౌరవ వేతనం ఇవ్వడానికి పైసలు లేవా అని ప్రశ్నించారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూ. 5,000 గౌరవ వేతనం, రూ. 300 కమిషన్, మినీ సూపర్ మార్కెట్లు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని, కానీ అధికారంలోకి వచ్చాక కనీసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. రేషన్ డీలర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని హెచ్చరించిన హరీశ్ రావు (Harish Rao), తక్షణమే డీలర్ల సంఘాన్ని చర్చలకు పిలిచి ఇచ్చిన‌ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో వచ్చే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల వేదికగా ప్రభుత్వాన్ని ఎండగడతామని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఆసక్తికర పరిణామం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు హరీశ్ రావు సపోర్ట్..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>