కలం, కరీంనగర్: పిల్లలు పుట్టడం లేదనే నెపంతో భార్యను గొంతు పిసికి హత్య చేసిన భర్త దావు చంద్రకుమార్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు (Karimnagar Rural Police) మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్న చంద్రకుమార్‌కు పిల్లలు కలగకపోవడంతో భార్య స్వరూపకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే, అందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో భార్యను వదిలించుకోవాలని భావించాడు. ఈ నెల 25న రాత్రి మద్యం మత్తులో ఉన్న చంద్రకుమార్.. అద్దె ఇంట్లో నిద్రిస్తున్న భార్య స్వరూప గొంతు పిసికి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
స్వరూప తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద మరో ప్రాంతానికి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడిని రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. నేరాన్ని అంగీకరించిన నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.

