కలం, నిజామాబాద్ బ్యూరో: మాధవ్ నగర్ ఆర్వోబీపై ఎంపీ అర్వింద్ దుష్ప్రచారం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి (Nagesh Reddy) మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిధులు విడుదలకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ విషయం తెలిసే బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే నిరసన దీక్ష చేపట్టారని విమర్శించారు. గతంలో కూడా ఎంపీ అర్వింద్ ఇలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఎంపీగా ఏడేళ్ల నుంచి ఈ జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిజామాబాద్ జిల్లాకు పరిశ్రమలు తెప్పించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కలిపించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నిర్వహించిన ధర్నాలో ప్రజలు పాల్గొనలేదని కేవలం వాళ్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే పాల్గొన్నారని విమర్శించారు.
ఇప్పుడే గుర్తొచ్చిందా..?
మాధవ్ నగర్ ఆర్వోబీ నిర్మాణం ఇప్పుడే గుర్తొచ్చిందా.. అని నిజామాబాద్ నగర పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ విమర్శించారు. స్కూల్ పిల్లలను బలవంతంగా ధర్నాలో కూర్చోబెట్టి, వారిని చదువుకోకుండా చేశారని ఆరోపించారు. కోట్ల రూపాయల ధాన్యం కుంభకోణం చేసిన వ్యాపారులు తప్ప ఎవరూ ముందుకు రాలేదన్నారు. త్వరలోనే నిజామాబాద్‌లో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారనే గ్రహించి ఎంపీ అర్వింద్ ధర్నా నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. మహేష్ కుమార్ గౌడ్‌తో అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తాన్న ఎమ్మెల్యే సూర్యనారాయణ.. ఎంపీ అర్వింద్‌కు భయపడి ధర్నాలో కూర్చున్నారని విమర్శించారు. కేంద్ర నిధులు తీసుకువస్తే స్వాగతిస్తామని.. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డుగా వస్తే చూస్తూ ఊరుకోమన్నారు. రాబోయే రోజుల్లో అర్వింద్‌ను నిజామాబాద్ నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

