కలం, జగిత్యాల: నవంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరగనున్న ‘ఛలో ఢిల్లీ’ (Chalo Delhi) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చింతల నిర్మల రెడ్డి, జగిత్యాల జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు ఎన్నం కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
నిర్మల రెడ్డి, కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వందేళ్ల క్రితం బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ‘సైమన్ గో బ్యాక్’ అని నినదించామని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తాకట్టు పెడుతున్న బ్రిటిష్ జనతా పార్టీ (బీజేపీ)కి, ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఓట్ల చోరీకి పాల్పడుతున్న సర్ (జ్ఞానేష్) గో బ్యాక్ అని నినదించేందుకు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తున్నామని పేర్కొన్నారు.
దేశ రాజధానిలో తెలంగాణ గళం, బలాన్ని చాటాలని వారు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నవంబర్ 1న జరిగే బహిరంగ సభకు తెలంగాణ నుంచి వేలాదిగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ బలాన్ని చాటాలని నిర్మల రెడ్డి, కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

