ఆలేరులో ‘అలయ్ బలయ్’.. ప్రారంభించిన బండారు దత్తాత్రేయ

కలం, యాదగిరిగుట్ట: రాజకీయాలు వేరు.. ప్రజల మధ్య ఆత్మీయత వేరు! పార్టీల మధ్య ఎన్ని విభేదాలున్నా, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ముందు అందరూ ఒక్కటేననే సందేశాన్ని చాటేలా ఆలేరులో ‘అలయ్ బలయ్’ (Alai Balai) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బండ్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి నేతృత్వంలో జరిగిన ఈ వేడుక తెలంగాణ సంస్కృతి, సోదరభావం, సామాజిక ఐక్యతకు వేదికగా నిలిచింది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ప్రజా గాయని విమలక్క, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణక్క తదితరులు హాజరయ్యారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఒకే వేదికను పంచుకోవడం ద్వారా తెలంగాణలోని సామాజిక, సాంస్కృతిక ఐక్యతకు ఈ వేడుక ప్రాధాన్యతను చాటింది. రాజకీయాలకు అతీతంగా ప్రజల మధ్య అనుబంధాలను బలోపేతం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది.

సంస్కృతి.. సంప్రదాయం.. సోదరభావం!

తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబించే ‘అలయ్ బలయ్ (Alai Balai)’ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. భిన్న అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు సైతం ఆత్మీయంగా కలుసుకునే సామాజిక వేదిక. పరస్పర గౌరవం, స్నేహభావం, సాంస్కృతిక విలువలను ముందుకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. బండ్రు శోభారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆలేరు నియోజకవర్గంలో ప్రత్యేక చర్చకు దారితీసింది.

అన్ని పార్టీల నాయకులు పాల్గొనడంతో ఈ వేడుకకు రాజకీయ, సామాజిక ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ, సమాజంలో ఐక్యతా భావాన్ని పెంపొందించాలనే సందేశంతో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా సాగింది. రాజకీయాలకు అతీతంగా మనుషులను కలిపే సంస్కృతి.. తెలంగాణ నేల ప్రత్యేకత. ఆలేరులో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం ఆ స్ఫూర్తిని మరోసారి చాటిచెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>