కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: దేశ విచ్చిన్నం కోరుకునే శక్తులతో కలిసి రాహుల్ గాంధీ నడుస్తున్నారని బీజేపీ నేత మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) మండిపడ్డారు. ఆదివారం కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గోకఫసాల్ వాడ గ్రామంలో ప్రధాన మంత్రి 139వ మాన్ కీ బాత్ కార్యక్రమం స్థానిక ప్రజలు, నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలసి వీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న ఉత్పత్తులు, వస్త్రాల,వస్తువుల విశేషాల గురించి దేశం మొత్తానికి మన్ కీ బాత్(Mann Ki Baat)లో ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారన్నారు. ప్రధాని సమర్థవంతమైన పాలన వల్ల నేడు భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూసేలా చేశారన్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతుందని ఆమె మండిపడ్డారు. మోదీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను 4వ స్థానంలో నిలబెట్టారని ఆమె గుర్తు చేశారు.
విదేశీ వేదికలపై భారతదేశాన్ని కించపరిచే విధంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతున్నారని, దేశాన్నిఅస్థిరపరిచే విధానాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయని అరుణ విమర్శించారు. ఆపరేషన్ సింధూర్‌తో శత్రు దేశాలకు భయం పుట్టించామని, భవిష్యత్తులో భారత్‌తో ఎలాంటి సంబంధాలు పెంచుకోవాలో ప్రపంచ దేశాలకు అర్థమైందన్నారు. సర్ ప్రక్రియ మొదటిసారి జరగడం లేదని, ఇప్పటికే 8 సార్లు జరిగిందని చెప్పారు. గతంలో సర్ ప్రక్రియ మాట్లాడని నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ చేసి వచ్చిందా? దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని అరుణ (DK Aruna) డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, రతంగ్ పాండు రెడ్డి, పగడాకుల శ్రీనివాస్, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్, ప్రతాప్ రెడ్డి, పూనం చంద్ లహుటి, కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షులు అశోక్, సతీష్, బస్వరాజు, కేశవ రెడ్డి, శంకర్, బుగ్గప్ప, మురళీధర్, రాజశేఖర్, మహబూబ్ అలీ, కేశవ్ రెడ్డి, రాఘవేంద్ర, భాస్కర్, వివిధ మండలాల ముఖ్య నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read : వైభవ్ ఆటపై అప్పుడే తీర్పొద్దు: మొహమ్మద్ కైఫ్
Follow Us On : WhatsApp

