కలం, జగిత్యాల: ఉపాధి వెతుక్కుంటూ ఉక్రెయిన్ వెళ్లిన జగిత్యాల జిల్లా చెందిన హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (Vavilala Sudarshan Goud) యుద్ధ రంగంలో క్షిపణికి బలయ్యాడు. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఎట్టకేలకు ఆయన భౌతికకాయం స్వదేశానికి వస్తోంది. అక్టోబర్ 31న సొంతూరిలో అంత్యక్రియలు జరపబోతున్నారు. సుదర్శన్ గౌడ్ ఉక్రెయిన్లో కాంక్రీట్ కార్మికుడిగా పనిచేస్తుండేవారు. సెప్టెంబర్ 1న రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఆయన దుర్మరణం పాలయ్యారు. దీనిపై ఉక్రెయిన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపడంతో భౌతికకాయాన్ని స్వదేశానికి అప్పగించడంలో తీవ్ర జాప్యం జరిగింది. మరోవైపు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ప్రవాసీ ప్రజావాణిలో వినతి..
మృతదేహాన్ని తెప్పించాలని మృతుడి భార్య భార్గవి ఇటీవల హైదరాబాద్లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మంత్రి లక్ష్మణ్ కుమార్ వెంటనే స్పందించి సీఎంకు విషయాన్ని తెలిపారు. ఆయన ఆదేశాలతో సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ నదీం ఈ నెల 24న ఉక్రెయిన్లోని భారత రాయబారి అంజనీ కుమార్కు అత్యవసర సందేశం పంపారు. కేంద్ర ప్రభుత్వంతో వేగంగా సమన్వయం చేసుకోవడంతో భౌతికకాయం తరలింపునకు అనుమతులు లభించాయని తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి తెలిపారు.
పోలాండ్ మీదుగా హైదరాబాద్కు..
ఉక్రెయిన్ గగనతలంలో విమాన రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉన్నందున మృతదేహాన్ని రోడ్డు మార్గంలో సరిహద్దులు దాటించి పోలాండ్కు తరలించనున్నారు. అక్కడి నుంచి విమానంలో పోలాండ్లోని వార్సా నుంచి నెదర్లాండ్స్ (ఆమ్స్టర్డామ్) మీదుగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేర్చనున్నారు. విమాన ప్రయాణం ఈ నెల 29న ప్రారంభమై అక్టోబర్ 31 తెల్లవారుజామున శవపేటిక హైదరాబాద్ చేరుకుంటుంది. ప్రత్యేక అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని హస్నాబాద్ గ్రామానికి తరలించి, ప్రభుత్వ పర్యవేక్షణలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

