epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నల్లమలసాగర్ ప్రాజెక్టుపై లాయర్లతో చర్చలు

కలం డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు (Polavaram Nallamala Sagar) వ్యతిరేకంగా తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ అభ్యంతరాలను తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుడుగు వేయడాన్ని వ్యతిరేకించింది. అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ (విభజన) చట్టం నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి బ్రేకు వేయాలని ఆ పిటిషన్‌లో తెలంగాణ స్పష్టం చేసింది. పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో జలవనరుల నిపుణులు, సీనియర్ న్యాయవాదులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో సమావేశమై చర్చించారు.

‘సుప్రీం’ సీజే బెంచ్ ముందు విచారణ :

ఏపీ ప్రభుత్వం తొలుత పోలవరం-బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినా తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలతో ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం రిటన్ పంపింది. దాని స్థానంలో పేరు మార్చిన ఏపీ సర్కారు.. పోలవరం-నల్లమల సాగర్ పేరుతో కొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. ఇది కూడా పలు చట్టాలకు వ్యతిరేకమైనదని, తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అనేక అంశాలను ఉదహరించారు. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మలా బాగ్చి నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు రానున్నది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వితో పాటు పలువురు వాదించనున్నారు.

అన్ని ఆధారాలు కోర్టు ముందుకు :

పిటిషన్ విచారణను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సర్కార్.. ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి, జలవనరుల నిపుణులు, ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ చర్చలు జరిపారు. ప్రభుత్వం తరఫున సమర్థమైన, బలమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. అవసరమైన అన్ని ఆధారాలనూ సిద్ధంగా ఉంచుకోవాలని ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ పిటిషన్ విషయాన్ని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనతో ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడింది, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులు, విభజన చట్టంపై ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతుండగానే డీపీఆర్‌ను సిద్ధం చేయడం.. వీటన్నింటినీ సుప్రీంకోర్టు దృష్టికి సీనియర్ న్యాయవాదులు తీసుకెళ్ళనున్నారు.

తక్షణం పనులను నిలిపివేయాలి :

ఎలాంటి అనుమతులు లేకుండానే పోలవరం నుంచి బనకచర్ల లేదా నల్లమలసాగర్‌కు గోదావరి నదిని లింక్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను నిలిపివేయాలన్నది తెలంగాణ ప్రధాన డిమాండ్. తక్షణమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ పనులను ఆపివేసేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. తొలుత కేంద్రం ఇచ్చిన అనుమతుల మేరకే పోలవరం ప్రాజెక్టు పనుల స్వరూపం ఉండాలని, బనకచర్ల లేదా నల్లమలసాగర్ వరకు విస్తరించేలా పనులు చేపట్టడం చట్టబద్ధం కావని ఈ పిటిషన్‌లో తెలంగాణ స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రీ-ఫీజిబులిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించటం సమంజసం కాదని అభ్యంతరం తెలిపింది. కేంద్ర జల సంఘం, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరింది.

కేంద్రం ఆర్థిక సాయాన్నీ ఇవ్వకూడదు :

కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పోలవరం-నల్లమలసాగర్ (Polavaram Nallamala Sagar) డీపీఆర్ తయారీకి సిద్ధపడుతున్నట్లు ఆ పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం వివరించింది. వెంటనే ఈ చర్యలను ఆపివేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఏపీ తలపెడుతున్న ఈ విస్తరణ ప్రాజెక్టులతో తెలంగాణ సాగునీటి సరఫరాలకు అన్యాయం జరగడం మాత్రమే కాక కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు కూడా లేవన్నారు. నిబంధనలను ఉల్లంఘించి కడుతున్నందున ఎలాంటి అనుమతులూ ఇవ్వకుండా స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు నిమిత్తం ఎలాంటి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో నొక్కిచెప్పింది.

Read Also: మరో చాన్స్ మిస్ అయిన బీఆర్ఎస్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>