కలం వెబ్ డెస్క్ : ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం (Largest Shivling) తన 2,100 కిలోమీటర్ల సుధీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకోబోతోంది. తమిళనాడు నుంచి బీహార్ వరకు ఆధ్యాత్మికతను వెదజల్లుతూ కదిలొచ్చిన ఈ మహాలింగం మరో రెండు రోజుల్లో తన గమ్యస్థానాన్ని చేరుకోనుంది. మహాబలిపురంలో (Mahabalipuram) రూపుదిద్దుకున్న ఈ గ్రానైట్ శివలింగం 33 అడుగుల ఎత్తు, 210 టన్నుల బరువుతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ శివలింగాన్ని బీహార్లోని తూర్పు చంపారణ్ జిల్లా చాకియాలో నిర్మాణంలో ఉన్న విరాట్ రామాయణ ఆలయం (Virat Ramayan Temple)లో ప్రతిష్టించనున్నారు. ఈ ఆలయాన్ని చేరుకునేందుకు 96 చక్రాల భారీ వాహనంలో నవంబర్ 21న మహాబలిపురం నుంచి బయలుదేరిన శివలింగం జనవరి 3న బీహార్లోని గోపాల్గంజ్ చేరుకుంది. ప్రతిష్టాపన దగ్గర పడుతుండటంతో చాకియాలో పండుగ వాతావరణం నెలకొంది.
ఒకే గ్రానైట్ రాయితో తయారైన అతిపెద్ద శివలింగం చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంది. దీన్ని తమిళనాడులోని తిరునెల్వేలి క్వారీ నుంచి తీసుకొచ్చిన సుమారు 350 టన్నుల నల్ల గ్రానైట్ రాయితో చెక్కారు. ఈ మహా శిల్పాన్ని రూపొందించడానికి సుమారు మూడు సంవత్సరాలు పట్టింది. మహాబలిపురానికి చెందిన ప్రముఖ శిల్పి సి. లోకనాథన్ స్థపతి నేతృత్వంలో 30 మంది కళాకారులు ఈ శివలింగాన్ని తీర్చిదిద్దారు. ఈ శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. లింగం పై భాగంలో 14 పొరలుగా అమర్చిన 1,008 చిన్న లింగాలు ఉన్నాయి. శివలింగానికి ముందుగా వాస్తు పూజలు పూర్తి చేసి భారీ క్రేన్ల సహాయంతో ప్రత్యేకంగా తయారు చేసిన 96 చక్రాల భారీ వాహనంపై ఎక్కించారు.
రాత్రివేళల్లోనే ప్రయాణం
ఈ భారీ శివలింగాన్ని తరలించడం అంత ఈజీగా జరగలేదు. దీని తరలింపు కోసం వినియోగించిన వాహనం చాలా పెద్దది కావడంతో కొన్ని ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతులతో, ప్రజలకు ఇబ్బంది కలగకుండా రాత్రివేళల్లో మాత్రమే ఈ శివలింగాన్ని తరలిస్తున్నారు. తమిళనాడు నుంచి బయల్దేరిన ఈ శివలింగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మీదుగా 2,100 కిలో మీటర్లు ప్రయాణించి బీహార్ చేరుకుంది.
ఇది కేవలం ఒక భారీ శివలింగం రవాణాగా కాకుండా ఓ గొప్ప ఆధ్యాత్మిక యాత్రలా సాగింది. మార్గమధ్యలో ఉన్న పలు నగరాల్లో భక్తులు ఈ సహస్రలింగాన్ని దర్శించి పూజలు చేశారు. చాకియాకు చేరుకున్న తర్వాత ఈ శివలింగాన్ని విరాట్ రామాయణ ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు. మూడు అంతస్తులుగా నిర్మిస్తున్న ఈ ఆలయానికి ఇదే ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. దక్షిణం నుంచి ఉత్తరం వరకూ భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా ఏకం చేసే ప్రతీకగా ఈ మహా శివలింగం నిలుస్తుందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

A Spiritual Milestone: World Largest 33-Foot Shivling Arrives in Bihar from Tamil Nadu for Virat Ramayan Temple #ViratRamayanTemple #Shivling #Mahadev #WorldRecord #WorldLargestShivling #Mahabalipuram#SpiritualIndia #Champaran #Kalam #Kalamdaily #kalamtelugu pic.twitter.com/0PE8VgzWck
— Kalam Daily (@kalamtelugu) January 4, 2026
Read Also: విమానాల్లో వాటిపై నిషేధం.. డీజీసీఏ కీలక నిర్ణయం..
Follow Us On : WhatsApp


