కలం వెబ్ డెస్క్ : బీసీసీఐ(BCCI) ఆదేశాలతో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) తమ టీమ్ నుంచి బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్(Mustafizur)ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. మినీ వేలంలో రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసిన ముస్తాఫిజుర్ కేకేఆర్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అనేది కీలకంగా మారింది. ఇదే అంశంపై కేకేఆర్ మేనేజ్‌మెంట్ కూడా కసరత్తులు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ముస్తాఫిజుర్ స్థానాన్ని భర్తీ చేయడానికి కేకేఆర్ మూడు కీలక ఎంపికలపై దృష్టి సారించింది.
టీమిండియా సీనియర్ బౌలర్ ఉమేష్ యాదవ్(Umesh Yadav) తొలి ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు. గతంలో కేకేఆర్ తరఫున ఆడిన అనుభవం ఉన్న ఉమేష్ 2014 టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఎడమచేతి పేసర్ అవసరం ఉంటే ఆస్ట్రేలియా బౌలర్ స్పెన్సర్ జాన్సన్ కూడా ఈ రేసులో ఉన్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుంటే అతడికే ప్రాధాన్యం దక్కే అవకాశాలు ఉన్నాయి. అలాగే వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ పేరు కూడా చర్చలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో 6 వికెట్లు 12 పరుగుల అరుదైన బౌలింగ్ ప్రదర్శన అతడి ఖాతాలోనే ఉంది. ముస్తాఫిజుర్ ఆకస్మిక నిష్క్రమణతో కేకేఆర్ వ్యూహాలు మారాయి. అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.


