వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి.. సేవలపై బిగ్‌ అప్‌డేట్‌!

కలం, వరంగల్‌ బ్యూరో: వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి (Warangal Hospital) నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మిస్తున్న భారీ ఆస్పత్రిలో ముందుగా ఔట్‌ పేషెంట్‌ (OP) సేవలను ప్రారంభించి, అనంతరం పూర్తిస్థాయిలో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దసరా నుంచి ఓపీ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రణాళికతో పాటు నవంబర్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆస్పత్రి పూర్తయితే ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోగులు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఇబ్బందులు తప్పనున్నాయి. ఎంజీఎంపై ఒత్తిడి కూడా తగ్గనున్నది.

24 అంతస్తులు.. 2,018 పడకలు

వరంగల్‌ సిటీ పాత సెంట్రల్‌ జైలు స్థలంలో సుమారు 56 ఎకరాల విస్తీర్ణంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. తొలుత రూ.1,100 కోట్ల అంచనాలో చేపట్టిన ప్రాజెక్టు, అనంతరం రూ.1,371 కోట్లకు చేరింది. సుమారు 19.70 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో రూపుదిద్దుకుంటోంది. 24 అంతస్తులు, 2,018 పడకలు, 35 ఆపరేషన్‌ థియేటర్లతో పాటు వైద్యులు, సిబ్బంది కోసం 186 నివాస క్వార్టర్లు, రోగుల సహాయకుల కోసం సుమారు 250 ధర్మశాల గదులు కూడా నిర్మిస్తున్నారు. వీటితోపాటు ఆడిటోరియం, వంటశాల, డైనింగ్‌, లాండ్రీ, మార్చురీ, యుటిలిటీ బ్లాక్‌ వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు.

దసరా నుంచి ఓపీ సేవలు షురూ

ఆస్పత్రి నిర్మాణం పూర్తయిన తర్వాతే అన్నిసేవలు ప్రారంభించాలనే విధానానికి బదులుగా, ముందుగా అందుబాటులోని విభాగాల్లో ఓపీ సేవలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు ఆస్పత్రిని సందర్శించారు. భవన నిర్మాణంతోపాటు విద్యుత్‌, నీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ నెలలో 18 అంతస్తులను సిద్ధం చేయాలని, పనుల ఫురోగతిని వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లు ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు.

దసరా నాటికి ఓపీ సేవలు షురూ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. అయితే, నిర్ణీత గడువు నవంబర్ లోపు పూర్తి వైద్య సేవలు ప్రారంభించాలంటే భవన నిర్మాణంతోపాటు వైద్య పరికరాల ఏర్పాటు, విద్యుత్‌ కనెక్షన్లు, సాంకేతిక తనిఖీలు, వైద్యులు–సిబ్బంది నియామకాలు, విభాగాల నిర్వహణ వంటి అంశాలు కీలకం. అందువల్ల ఓపీ సేవల ప్రారంభం, పూర్తిస్థాయి ఆస్పత్రి నిర్వహణ పనులు సమాంతరంగా సాగాల్సి ఉంటుంది.

ఎంజీఎంపై ఒత్తిడి తగ్గేనా..

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి ఉమ్మడి వరంగల్‌ జిల్లాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎన్నో ఏళ్లుగా ప్రధాన వైద్యకేంద్రంగా ఉంది. రోగుల సంఖ్య పెరిగిపోతుండగా అందుబాటులోని వైద్య సదుపాయాలపై ఒత్తిడి ఉంటుంది. పాత భవనాల్లో భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ఘటనలు ఉంటుండగా.. కొత్త ఆస్పత్రిని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలనే డిమాండ్‌ పెరిగింది. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ప్రత్యేక వైద్య విభాగాల్లో సంప్రదింపులు, పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయి.

ప్రస్తుతం క్లిష్టమైన వైద్య సమస్యలకు హైదరాబాద్‌ వెళ్లాల్సి వస్తుండగా.. రోగుల్లో కొందరు వరంగల్‌లోనే చికిత్స పొందే అవకాశం లభిస్తుంది. దీంతో ప్రయాణ ఖర్చులు, సమయం, రోగుల కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గే వీలుంది. ఇలాంటి ప్రయోజనాలు ఆస్పత్రిలో వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, అవసరమైన పరికరాలు, మందులు, నిరంతర సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పుడే సాధ్యమవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉత్తర తెలంగాణకు ఆరోగ్య భరోసా

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కేవలం మరో ప్రభుత్వ వైద్య భవనం కాదు. ఉత్తర తెలంగాణలో ఆధునిక వైద్య సదుపాయాలను విస్తరించేందుకు చేపట్టిన కీలక ప్రాజెక్టు. వరంగల్‌, హనుమకొండతోపాటు మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి, జనగామ, పెద్దపల్లి, కరీంనగర్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఇది ప్రధాన వైద్య కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. దసరా నుంచి ఓపీ సేవలు, నవంబరులో ప్రారంభోత్సవం అనే లక్ష్యాలను ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, మిగిలిన పనులను గడువులోగా పూర్తి చేసి వైద్య సేవలను ఆచరణలోకి తీసుకురావడం ఇప్పుడు కీలక పరిణామంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>