కలం, వరంగల్ బ్యూరో : బతుకమ్మ వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాలతో, ప్రశాంతంగా జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిడబ్ల్యూఎంసీ కమిషనర్ (GWMC Commissioner) టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రేటర్ వరంగల్ లోని చిన్నవడ్డేపల్లి, బేస్తం చెరువు, ఉర్స్ చెరువు, బంధం చెరువు, పద్మాక్షి గుండం తదితర చెరువుల ప్రాంతాల వద్ద బతుకమ్మ ఏర్పాట్లను కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించి, పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, తాగునీరు, భద్రత, బారికేడ్ల ఏర్పాటు తదితర అంశాలపై కీలక సూచనలు చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎస్ఈ రాజ్కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఈఈలు సంజయ్ కుమార్, రవికుమార్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

