వనజీవి రామయ్య సతీమణికి బీజేవైఎం ఘన సన్మానం

కలం, ఖమ్మం బ్యూరో: ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత స్వర్గీయ వనజీవి రామయ్య పర్యావరణ పరిరక్షణకు చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు కొనియాడారు. ప్రతి మొక్కనూ తన కుటుంబ సభ్యుడిగా భావించి, తుదిశ్వాస వరకు పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేసిన మహనీయుడిగా ఆయనను స్మరించుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని రెడ్డిపల్లి (Reddipalli) గ్రామంలో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో వనజీవి రామయ్య సతీమణి జానమ్మను ఘనంగా సత్కరించారు. ఆమె నివాసానికి వెళ్లిన నాయకులు, రామయ్య ప్రకృతి పరిరక్షణ కోసం చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ శాలువాతో సన్మానించి గౌరవించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. వనజీవి రామయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన స్ఫూర్తితో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందిస్తామని జానమ్మకు తెలిపారు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లని, పర్యావరణాన్ని కాపాడుకోవడమే వనజీవి రామయ్యకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు శాసనాల శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు నకిరికంటి వీరభద్రం, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నలమాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>