కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: నిబంధనలకు విరుద్ధంగా, తమ పరిధిని దాటి వైద్య సేవలు అందిస్తున్న ఐదు ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలపై (First Aid Centres) జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఏ. శ్రీనివాసులు మంగళవారం తనిఖీలు నిర్వహించి, ఐదు కేంద్రాలను మూసివేశారు. ఫస్ట్ ఎయిడ్ కేంద్రాల్లో ప్రథమ చికిత్స మాత్రమే అందించాల్సి ఉండగా, కొన్ని కేంద్రాల్లో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇవ్వడం, ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడం, నెబ్యులైజర్లు ఉపయోగించడం వంటి చికిత్సలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నిబంధనలను ఉల్లంఘించిన కేంద్రాలపై చర్యలు చేపట్టారు.
మిడ్జిల్‌లో ఒకటి, అదే మండలంలోని బోయినిపల్లిలో ఒకటి, కొత్తపల్లిలో ఒకటి, బాలానగర్ మండలం హేమాజీపూర్‌లో ఒకటి, నవాబ్‌పేట మండలం కాకర్లపహాడ్‌లో ఒకటి చొప్పున మొత్తం ఐదు ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను మూసివేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు ప్రథమ చికిత్సకే పరిమితం కావాలని, నిబంధనలకు విరుద్ధంగా పరిధి దాటి వైద్య సేవలు అందిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు, నోడల్ ఆఫీసర్ డాక్టర్ శివకాంత్, జిల్లా మాస్ మీడియా అధికారి జి. నర్సింహారెడ్డి, హన్మంతు హెల్త్ ఎడ్యుకేటర్ తదితరులు పాల్గొన్నారు.

