కలం, స్పోర్ట్స్: క్రికెట్ మైదానంలో ఎన్నో విజయాలు సాధించిన విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఇప్పుడు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. తాజాగా 37 ఏళ్ల వయసులో లింక్డ్‌ఇన్‌లోకి అడుగుపెట్టారు. తన తొలి పోస్ట్‌లోనే భారత క్రీడా రంగంపై తన విజన్‌ను వెల్లడించారు. కేవలం క్రీడాకారులుగానే కాకుండా, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే స్పోర్ట్స్ బ్రాండ్లను కూడా భారత్ తయారు చేయాలన్నది తన లక్ష్యమని స్పష్టం చేశారు. భారత్‌లో ప్రతి క్రీడకు ఆదరణ పెరగాలని కోహ్లీ ఆకాంక్షించారు.
కొత్త తరం క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో రాణించే సత్తా చూపిస్తున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడే బ్రాండ్లను నిర్మించే సామర్థ్యం కూడా భారత్‌కు ఉందని అభిప్రాయపడ్డారు. క్రీడా ఉత్పత్తుల రూపకల్పన, తయారీ, బ్రాండ్ల అభివృద్ధి, పంపిణీ.. ఇలా అన్ని విభాగాలను కలిపి భారత్ కేంద్రంగా ఒక సమగ్ర క్రీడా వ్యవస్థను నిర్మించాలనేది తన ఆలోచనగా వివరించారు. ఈ లక్ష్యంలో భాగంగానే కోహ్లీ అగిలిటాస్ స్పోర్ట్స్‌లో పెట్టుబడిదారుగా చేరారు.
అంతేకాదు, వన్8వరల్డ్‌కు సహ వ్యవస్థాపకుడిగా, సృజనాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. తన కెరీర్లోనూ కొత్త సవాళ్లను స్వీకరించడం, ప్రమాణాలను పెంచుకోవడం, కొత్తగా ఆలోచించడం తనకు అలవాటని తెలిపారు. వన్8వరల్డ్‌ను ప్రజల ముందుకు తీసుకురావడం తన జీవితంలో ప్రత్యేకమైన సందర్భాల్లో ఒకటిగా అభివర్ణించారు. కోహ్లీ వ్యాపార ప్రయాణంలో మరో కీలక నిర్ణయం కూడా ఉంది. ప్యూమా సంస్థ నుంచి ఎనిమిదేళ్లకు సుమారు రూ.300 కోట్ల విలువైన కాంట్రాక్ట్ పొడిగింపు ప్రతిపాదన వచ్చినప్పటికీ, దాన్ని ఎంచుకోలేదు.
బదులుగా తన సొంత మూలధనం నుంచి సుమారు రూ.40 కోట్లను అగిలిటాస్ స్పోర్ట్స్‌లో పెట్టుబడిగా పెట్టారు. వన్8 బ్రాండ్‌ను కూడా వాటా కలిగిన వ్యాపారంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. 2023లో అగిలిటాస్ స్పోర్ట్స్‌ను అభిషేక్ గంగూలీ, అతుల్ బజాజ్, అమిత్ ప్రభు కలిసి స్థాపించారు. వీరిలో అభిషేక్ గంగూలీ గతంలో ప్యూమా ఇండియా, ఆగ్నేయాసియా మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఉత్పత్తుల రూపకల్పన నుంచి తయారీ, రిటైల్ విక్రయాల వరకు అన్ని దశలను ఒకే వ్యవస్థలో నిర్వహించే విధానంతో అగిలిటాస్ ముందుకు సాగుతోంది.

