గర్భిణులు, చిన్నారుల హెల్త్‌పై యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఫోకస్‌

కలం, యాదగిరిగుట్ట: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యాధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా సాధించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతిఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ నుంచి వైద్యాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంతోపాటు, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

గర్భిణుల నమోదు నుంచే పర్యవేక్షణ

గర్భిణుల నమోదు, గర్భధారణ సమయంలో నిర్వహించే ఏఎన్‌సీ పరీక్షలు, ప్రసవానంతర వైద్య సేవలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన గర్భిణులందరికీ నిర్ణీత సమయంలో వైద్య పరీక్షలు అందేలా చర్యలు తీసుకోవాలని, హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణలో వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

బాధ్యత వహించాల్సిందే!

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని వైద్యాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని, ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా చూడాలని సూచించారు. వైద్య సేవల నాణ్యత పెంపు, ఆరోగ్య కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు ప్రాధాన్యం ఇస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్‌తోపాటు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>