కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అకడమిక్ అండ్ కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ పోస్టుల (ACMO Posts) భర్తీకి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నిహారిక మంగళవారం తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో పనిచేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ హెడ్మాస్టర్లు (పీజీహెచ్‌ఎం) లేదా సీనియర్ స్కూల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తూ, సంబంధిత కేడర్‌లో కనీసం ఐదేళ్ల సర్వీసు అనుభవం కలిగి ఉండాలన్నారు.
ఎంపిక ప్రక్రియలో ఎస్టీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు, అలాగే ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఈ నెల 16వ తేదీలోగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

