కలం, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 20 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం రూ.205.95 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలంలో ఉన్న ZPHS నవాబుపేట (Nawabpet ZPHS) పాఠశాలకు రూ.11.85 కోట్ల నిధులు కేటాయించింది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ద్వారా జీవో నంబర్ 188, తేదీ 09-10-2026న జారీ చేసింది. ఈ సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. “జడ్చర్ల నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి మా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో తీర్చిదిద్ది, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. నవాబుపేట మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అభివృద్ధి కార్యక్రమంలో చేర్చి, రూ.11.85 కోట్ల నిధులు మంజూరు చేయడం సంతోషకరం. ఈ నిధులతో పాఠశాలలో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవకాశం ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యా సదుపాయాలు అందించడమే మా లక్ష్యం. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలి. జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తాను” అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు.

