కలం, వెబ్ డెస్క్: గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, పక్షవాతం లాంటి అనారోగ్య సమస్యలు ప్రాణాలకు ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి అంశాలు ప్రధాన కారణాలు. వీటిలో అధిక రక్తపోటును (Blood Pressure) చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు పెద్దల్లో ఒకరు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అయితే, బాధితుల్లో చాలామందికి తమకు రక్తపోటు ఉన్న విషయమే తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రక్తపోటును సకాలంలో గుర్తించి నియంత్రించకపోతే గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వ్యాధుల ముప్పు పెరుగుతుంది. అందుకే వైద్య నిపుణులు అధిక రక్తపోటును సైలంట్ కిల్లర్‌గా పిలుస్తున్నారు.
బీపీతోనే అనేక అనారోగ్య సమస్యలు
శరీరంలోని ప్రతి అవయవం సక్రమంగా పనిచేయాలంటే రక్త ప్రసరణ నిరంతరంగా జరగాలి. ఇందుకోసం గుండె రక్తాన్ని రక్తనాళాల ద్వారా శరీరమంతటా పంప్ చేస్తుంది. ఈ క్రమంలో రక్తం రక్తనాళాల గోడలపై కలిగించే ఒత్తిడినే రక్తపోటు అంటారు. దీనిని రెండు సంఖ్యల రూపంలో కొలుస్తారు. మొదటి సంఖ్యను సిస్టోలిక్ రక్తపోటు అని, రెండో సంఖ్యను డయాస్టోలిక్ రక్తపోటు అని పిలుస్తారు. గుండె సంకోచించి రక్తాన్ని పంప్ చేసే సమయంలో రక్తనాళాలపై ఉండే ఒత్తిడిని సిస్టోలిక్ ఒత్తిడి సూచిస్తుంది. గుండె తదుపరి స్పందనకు ముందు విశ్రాంతి తీసుకునే సమయంలో ఉండే ఒత్తిడిని డయాస్టోలిక్ ఒత్తిడి తెలియజేస్తుంది. ఈ రెండు కొలతలు గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో కీలకంగా ఉంటాయి. సాధారణంగా 120/80 ఎంఎం హెచ్‌జీ రక్తపోటును నార్మల్ స్థాయిగా పరిగణిస్తారు. అయితే, వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, వైద్య మార్గదర్శకాల ఆధారంగా రక్తపోటు స్థాయిలను వైద్యులు అంచనా వేస్తారు.
నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు
అధిక రక్తపోటు నివారణ, చికిత్సకు సంబంధించి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA), అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ (ACC) కొత్త మార్గదర్శకాలను విడుదల చేశాయి. రక్తపోటును (Blood Pressure) ముందుగానే గుర్తించడం, అవసరమైన చికిత్స అందించడం, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించడం ఈ మార్గదర్శకాల ప్రధాన లక్ష్యం. రక్తపోటు సమస్యకు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారు సైతం క్రమం తప్పకుండా బీపీని పరీక్షించుకోవడం అవసరం. ఉప్పు అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం, వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడటం ద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

